మరణంలోనూ నలుగురికి ప్రాణదానం.. రైతు అవయవదానం
- రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తుల దానంతో నలుగురికి కొత్త జీవితం
- బ్రెయిన్ డెడ్ అయిన నర్సిరెడ్డి అవయవాలను దానం చేసిన కుటుంబం
నల్గొండ జిల్లా: పుట్టెడు దుఃఖంలోనూ మానవత్వాన్ని చాటుతూ ఓ రైతు కుటుంబం తీసుకున్న నిర్ణయం పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. వ్యవసాయ పనుల్లో భాగంగా ట్రాక్టర్‌పై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఉమ్మడి నల్గొండ జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం సింగారానికి చెందిన రైతు పన్నాల నర్సిరెడ్డి (52) అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు.
నర్సిరెడ్డి బ్రెయిన్ డెడ్ అయిన నేపథ్యంలో ఆయన భార్య భాగ్యలక్ష్మి, కుటుంబ సభ్యులు గొప్ప మనసుతో అవయవదానానికి ముందుకొచ్చారు. ఆయన రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులను దానం చేయడంతో నలుగురు బాధితులకు అవయవ మార్పిడి ద్వారా కొత్త జీవితం పొందే అవకాశం కలిగింది.
తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ ఇతరుల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయం మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. మరణానంతరం కూడా నలుగురి జీవితాల్లో వెలుగులు నింపిన నర్సిరెడ్డి అవయవదాతగా చిరస్మరణీయులయ్యారు.
నర్సిరెడ్డి కుటుంబం చూపిన ఔదార్యం అవయవదానంపై సమాజంలో మరింత అవగాహన పెంచాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.