రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
- కక్కిరేణిలో కరపత్రాలు ఆవిష్కరించిన సీపీఎం నాయకులు
- నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో అఖిల భారత 36వ మహాసభలు
యాదాద్రి భువనగిరి జిల్లా, కక్కిరేణి, అక్టోబర్ 31 (ఎన్ టుడే న్యూస్): నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు నల్లగొండలో నిర్వహించనున్న అఖిల భారత 36వ రైతు సంఘం జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ కక్కిరేణి గ్రామంలో కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు వనం ఉపేందర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో దేశవ్యాప్తంగా రైతాంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల హక్కుల పరిరక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి రైతులంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
రైతాంగ సమస్యలపై చర్చించి, భవిష్యత్తు పోరాటాలకు కార్యాచరణ రూపొందించేందుకు ఈ జాతీయ మహాసభలు వేదికగా నిలుస్తాయని తెలిపారు. నల్లగొండలో జరిగే మహాసభలకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకుడు వేముల సైదులు, శాఖ కార్యదర్శి కన్నబోయిన యాదయ్య, రైతులు పిట్ట శ్రీనివాస్‌రెడ్డి, యాదయ్య, శ్రీను, భిక్షం, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.