దేశ ఐక్యతకు ప్రతీక సర్దార్ వల్లభాయ్ పటేల్ కొండపర్వలో ఘనంగా పటేల్ జయంతి వేడుకలు
విస్సన్నపేట, అక్టోబరు 31: ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో భారతదేశ తొలి ఉప ప్రధాని, భారతరత్న పురస్కార గ్రహీత, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ప్రముఖ సామాజిక కార్యకర్త, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి బోట్ల శివ సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి బోట్ల శివ సత్యనారాయణ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోషించిన పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలోని అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి జాతీయ సమైక్యతకు పటిష్ఠమైన పునాదులు వేసిన మహనీయుడు పటేల్ అని పేర్కొన్నారు. ఆయన దృఢ సంకల్పం, ధైర్యసాహసాలు, దేశ సమగ్రత కోసం చేసిన కృషి కారణంగానే భారతదేశ ఐక్యత మరింత బలపడిందని తెలిపారు. దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణలో పటేల్ చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఐక్యతా భావాన్ని పెంపొందిస్తూ దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఉమామహేశ్వరరావు, మహేష్, సత్యనారాయణ, మధు, శ్రీనుతో పాటు విద్యార్థులు యామిని, సంతోష్, ప్రదీప్, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు.