పెనుగొలను చెరువుకు చేరిన గోదావరి జలాలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని శివాలయం వద్ద ఉన్న చెరువుకు ఎన్‌ఎస్‌పీ కాలువ ద్వారా గోదావరి జలాలు చేరుతున్నాయి. గత ఐదు రోజులుగా చెరువులోకి నీరు వస్తున్నట్లు ఆయకట్టు రైతులు తెలిపారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సాగర్ కాలువ రెండో జోన్ ద్వారా నీటిని విడుదల చేసినట్లు రైతులు తెలిపారు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని ఖమ్మం జిల్లా మధిర, ఎర్రుపాలెం మండలాలకు గోదావరి జలాలు తరలుతున్నాయి. ఈ నీటి మార్గంలో పెనుగొలను గ్రామం ఉండటంతో అక్కడి చెరువుకు కూడా నీరు చేరుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులో నీరు పూర్తిగా తగ్గిపోయిన సమయంలో అనూహ్యంగా గోదావరి జలాలు చేరడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. చెరువులోకి నీరు రావడంతో సాగుకు కొంత భరోసా ఏర్పడిందని ఆయకట్టు రైతులు తెలిపారు. పెనుగొలను చెరువుకు గోదావరి జలాలు చేరేందుకు చర్యలు తీసుకున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆయకట్టు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.