గర్భిణీపై దాడి కేసులో భర్తకు 6 నెలల జైలు శిక్ష
చిత్తూరు, సెప్టెంబర్ 18, Ntoday న్యూస్: గర్భిణీపై దాడి చేసి గాయపరిచిన కేసులో భర్తకు చిత్తూరు VI అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం 6 నెలల సాధారణ జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి టి. హరిత శుక్రవారం తీర్పు వెలువరించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. చిత్తూరు వెంకట్రావు కాలనీకి చెందిన A. దేవి తన భర్త S. బాబు (40), అత్త E. సావిత్రి (54) నుంచి కుటుంబపరమైన వేధింపులు ఎదుర్కొంటూ కొంతకాలంగా తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. 2019 ఏప్రిల్ 8న రాత్రి దేవి నివాసానికి వెళ్లిన భర్త, అత్త ఆమెతో గొడవపడి దాడి చేసినట్లు ఫిర్యాదు నమోదైంది. అప్పటికి దేవి గర్భిణీగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మరుసటి రోజు విధులకు వెళ్తున్న సమయంలో చిత్తూరు CMT రోడ్డులోని షర్మన్ మెమోరియల్ గర్ల్స్ హైస్కూల్ వెనుక భాగంలో మరోసారి దాడి జరిగినట్లు కేసు నమోదైంది. అనంతరం దేవికి తీవ్ర కడుపునొప్పి, రక్తస్రావం కావడంతో చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించగా, గర్భస్రావం జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఫిర్యాదు ఆధారంగా అప్పటి చిత్తూరు I టౌన్ ఎస్‌ఐ G. పురుషోత్తం రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలాలను పరిశీలించి, బాధితురాలు, ఇతర సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. అనంతరం 2019 మే 2న A-1 బాబు, A-2 సావిత్రిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా చార్జ్‌షీట్ దాఖలు చేయగా, విచారణ అనంతరం కోర్టు A-1 S. బాబును IPC సెక్షన్ 323 కింద దోషిగా నిర్ధారించింది. ఆయనకు 6 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా రెండు వారాల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది.
అయితే A-1పై నమోదైన IPC సెక్షన్ 313 అభియోగం రుజువు కాకపోవడంతో ఆ అభియోగం నుంచి ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. A-2 E. సావిత్రిపై ఉన్న IPC సెక్షన్లు 313, 323 r/w 34 కింద అభియోగాలు రుజువు కాకపోవడంతో ఆమెను కూడా నిర్దోషిగా విడుదల చేసింది.
కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేసిన అప్పటి చిత్తూరు I టౌన్ ఎస్‌ఐ G. పురుషోత్తం రెడ్డి, కేసు విచారణను పర్యవేక్షించిన కోర్ట్ మానిటరింగ్ సెల్ సిబ్బంది ఖాదర్, కోర్టు కానిస్టేబుల్ నరసింహులు, కోర్ట్ మానిటరింగ్ సెల్ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ మనోహర్, కోర్టులో కేసును వాదించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ M. బాలాజీలను జిల్లా ఎస్పీ తుషార్ డూడి, IPS అభినందించారు.