పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
ఐసీడీఎస్ ప్రాజెక్టు కొత్తపేట పరిధిలోని మండలంలోని లొల్ల 204 అంగన్వాడి కేంద్రంలో శనివారం అంగన్వాడి ఉత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీడీపీఓ ఎ. గజలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోషణ ట్రాకర్ యాప్ లో లబ్ధిదారుల నమోదు, పీఎంవీవై లబ్ధిదారుల నమోదు, మిషన్ ఇంద్రధనుష్, పోషణ భీ పడాయీ భీ తదితర కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎ. గజలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందించే పోషకాహార కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బాలల సంరక్షణ కమిషన్ (ఎస్ సి పి సి ఆర్ ) సభ్యురాలు డా. పి. రాణి పాల్గొని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు. లబ్ధిదారులకు పోషకాహారం, ఆహార పదార్థాల పోషక విలువలు, పిల్లల ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం తల్లులతో కలిసి పోషణ ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ఇద్దరు ప్రీ- స్కూల్ విద్యార్థుల తల్లులను సత్కరించారు. అనంతరం వాడపల్లి దేవస్థానం వద్ద భక్తులకు, మహిళలకు, గర్భిణీలు, వృద్ధులకు ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించరాదని సూచిస్తూ కొందరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ కె. పద్మావతి, అంగన్వాడి సిబ్బంది, వైద్య సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు, తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.