కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్: గొల్లపల్లిలో BRS నిరసన ప్రదర్శన
గొల్లపల్లి :
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులైనా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తీవ్రంగా మోసం చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండల కేంద్రంలో BRS నాయకులు, కార్యకర్తలు మరియు రైతులతో కలిసి ఆయన భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, అక్కడ నుండి ఎడ్లబండిపై ప్రయాణిస్తూ ముస్కు శ్యాం సుందర్ గార్డెన్ వరకు ర్యాలీగా చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత, డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డితో పాటు నియోజకవర్గ BRS నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు:
అప్పులపై నిజాలు - KCR పాలనలో ఆస్తుల సృష్టి:
ప్రభుత్వ 1000 రోజుల అభివృద్ధి ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను తనకు పంపడం కాకుండా, అల్లూరి లక్ష్మణ్ కుమార్ ముందుగా తన స్వంత పరిపాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోవాలని విమర్శించారు.
కేసీఆర్ హయాంలో చేసిన అప్పులపై నాటి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో స్పష్టమైన గణాంకాలు ఇచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ మొత్తం అప్పు ₹3,90,000 కోట్లు కాగా, అందులో ₹72,000 కోట్లు ఉమ్మడి రాష్ట్రం నుండి వచ్చిన అప్పులేనని వివరించారు.
ఉమ్మడి రాష్ట్ర అప్పులు మినహాయిస్తే KCR ప్రభుత్వం చేసింది ₹2,00,000 కోట్ల పైచిలుకు మాత్రమే.
KCR చేసిన అప్పులన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు (40 లక్షల ఎకరాలకు నీరు), జిల్లాల వారీగా మెడికల్ కాలేజీలు, గురుకుల పాఠశాలలు, కలెక్టరేట్లు, పోలీస్ కమిషనరేట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వంటి శాశ్వత ఆస్తుల సృష్టికే వెచ్చించారని పునరుద్ఘాటించారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి కాకముందే ₹3.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని, కానీ ఆ నిధులతో ఏ ఒక్క అభివృద్ధి ప్రాజెక్టు లేదా నిర్మాణం చేపట్టలేదని ప్రశ్నించారు.
నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం:
రోళ్లవాగు ప్రాజెక్టు: ధర్మపురి, సారంగాపూర్ మండలాలకు లబ్ధి చేకూర్చే ఈ ప్రాజెక్టు పనులు 95% పూర్తయినా, కేవలం గేట్లు అమర్చడంలో ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహిస్తోంది.
నీటిపారుదల – రహదారులు: అక్కపెల్లి చెరువు అభివృద్ధికి ₹72 కోట్లు, దొంతాపూర్ రోడ్డుకు ₹32 కోట్లు, క్యాంప్ ఆఫీస్ రోడ్డుకు ₹16 కోట్లు కేటాయించగా, యశ్వంతరావుపేట చెరువు పూడికతీతకు ₹5 కోట్లు తెచ్చినా పనులు మొదలుపెట్టలేదు. మ్యాదరి గండి మాటు పనులకు ₹6 కోట్లతో టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లింక్ కెనాల్ (D83B/11): మేడారం రిజర్వాయర్ నుండి 14 గ్రామాలకు సాగునీరు అందించే లింక్ కెనాల్ పనులను తమ హయాంలోనే ₹12 కోట్లతో పూర్తి చేశామని గుర్తుచేశారు.
రాయపట్నం, ముత్తురూరు, రాజారం-ధమ్మన్నపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనుల నిర్వహణ సరిగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, మాతా శిశు ఆసుపత్రిలో సిబ్బంది లేరని తెలిపారు.
సంక్షేమ పథకాల విస్మరణ:
KCR హయాంలో ‘రైతు బంధు’ ద్వారా ఏడాదికి ₹10,000 ఆర్థిక సాయాన్ని 80 లక్షల మంది రైతులకు ఒక్క రోజులోనే ఖాతాల్లో జమ చేసిన ఘనత ఉందన్నారు. అలాగే ‘రైతు బీమా’ కోసం ఏడాదికి ₹1,500 కోట్ల ప్రీమియం చెల్లించి రైతు కుటుంబాలకు ధైర్యంగా నిలిచామన్నారు.
నేడు రైతు భరోసా, దళితబంధు, పెన్షన్ల పెంపు (₹2,000 నుండి ₹4,000), మహిళలకు ₹2,500 సాయం, కళ్యాణలక్ష్మిలో తులం బంగారం వంటి ఎన్నికల హామీలను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.
గతంలో దివ్యాంగుల సంక్షేమ బడ్జెట్‌ను ₹5 కోట్ల నుండి ₹65 కోట్లకు పెంచి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, త్రీ-వీలర్ వాహనాలు, బ్యాటరీ సైకిళ్లు అందించగా.. ప్రస్తుత పాలనలో ఒక్క బ్యాటరీ సైకిల్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.
మొత్తంగా, KCR హయాంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి పాలనను, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతూ విమర్శలు గుప్పించారు.