స్కీమ్ వర్కర్ల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి
12న విజయవాడ ధర్నా చౌక్‌లో మహాధర్నా.. జయప్రదం చేయాలని పిలుపు
నూజివీడు, సెప్టెంబర్ 3: పాఠశాల పారిశుధ్య కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులకు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ఏఐసీటీయూ జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు డివిజన్ సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిలభారత స్కీమ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వేముల బక్కయ్య మాట్లాడుతూ.. 23 ఏళ్లకు పైగా పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు సరైన వేతనాలు అందడం లేదని, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగినా పాలకులు కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల శానిటేషన్ కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులకు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని కోరారు.
స్కీమ్ వర్కర్లకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. మండలానికి ఒక స్మార్ట్ కిచెన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇప్పటికే తక్కువ వేతనాలతో పనిచేస్తున్న కార్మికుల ఉపాధిపై మరింత ప్రభావం పడుతోందన్నారు. స్మార్ట్ కిచెన్ కేంద్రాల విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్కీమ్ వర్కర్లకు నెలకు రూ.42 వేల వేతనం చెల్లించాలని, నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రూ.5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించడంతో పాటు సంవత్సరంలోని 12 నెలలకు వేతనం అందించాలని, గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని, నెలకు రెండు సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా రాజకీయ వేధింపులు, కక్ష సాధింపు చర్యలను నిలిపివేయాలని, కార్మికుల నియామక పరిధి నుంచి పేరెంట్స్ కమిటీలను తొలగించాలని కోరారు. పరిశ్రమ అనే నిర్వచనానికి సంబంధించి కార్పొరేట్లకు అనుకూలంగా చేసిన సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నూజివీడు సబ్‌కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నకు అందజేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12న విజయవాడ ధర్నా చౌక్‌లో ఏఐసీటీయూ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు వేముల బక్కయ్య తెలిపారు. స్కీమ్ వర్కర్లు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీటీయూ సభ్యులు పల్లెపాము భవాని, మేకల కుమారి, స్కీమ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షురాలు కలపాల రాణి, పాముల దేవమాత, రంగు పద్మావతి, చించిలి గంగమ్మ, చౌటపల్లి అరుణ, బత్తిన అరుణకుమారి, పిల్లి లక్ష్మీ, మేకల రాములమ్మ, జలసూత్రం అనసూర్య, పి.కిరణ్‌కుమారి, జె.రాధామణి, బొకిరాల వజ్రం, కే.రాణి, కూరపాటి గంగ, నల్లపోతు మేరమ్మ, టి.సక్కుబాయమ్మ, పత్తిపాటి సారమ్మ, పి.రమ తదితరులు పాల్గొన్నారు.