కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. అధిష్ఠానంపై తీవ్ర ఆరోపణలు భర్తరఫ్ నిర్ణయంపై మండిపాటు.. “నాకు ఒక్కమాట కూడా చెప్పలేదు”
హైదరాబాద్, సెప్టెంబర్ 3: తనను మంత్రి పదవి నుంచి తొలగించడంపై కాంగ్రెస్ నేత కొండా సురేఖ తీవ్ర ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిష్ఠానం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే భర్తరఫ్ చేసిందని ఆరోపించారు. తనపై కక్ష, కుట్రతోనే ఈ చర్య తీసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి పదవి నుంచి తొలగించే ముందు కనీసం తనకు విషయం చెప్పాల్సిందని సురేఖ అన్నారు. “ఉరిశిక్ష అమలు చేసే సమయంలో కూడా ఉరివేస్తున్నామని చెబుతారు.. చివరిగా ఏమైనా కోరిక ఉందా అని అడుగుతారు. కానీ నాకు మాత్రం ఒక్కమాట కూడా చెప్పకుండా నేరుగా పదవి నుంచి తొలగించారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుపతి రెడ్డి తదితరులు కావాలనే కక్ష కట్టి కుట్ర చేసి తనను మంత్రి పదవి నుంచి తొలగించేలా చేశారని ఆరోపించారు. సుమంత్ వ్యవహారంలోనూ కుట్ర జరిగిందని, సుమంత్ పేరు చెప్పి నేరాలు, సెటిల్మెంట్లతో తనను, తన కుటుంబాన్ని రాజకీయంగా బద్నాం చేసే ప్రయత్నం జరిగిందని అన్నారు. సుమంత్ కేసును సీసీఎస్‌కు బదిలీ చేసి లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆరోపించారు.
“పార్టీని తిట్టిన వాళ్లను ఎందుకు వదిలేశారు?”
తనను భర్తరఫ్ చేయించిన వారిలో మల్లు రవి కూడా ఉన్నారని సురేఖ ఆరోపించారు. గతంలో పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన నేతలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇందిరాగాంధీపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆమె.. పార్టీ, నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మరికొందరిని ఎందుకు వదిలేశారని నిలదీశారు.
“ప్రజల నుంచి రాజకీయాల్లోకి వచ్చాం. ప్రజలకే మేం జవాబుదారీ” అని సురేఖ స్పష్టం చేశారు. కడియం శ్రీహరి సైతం తన గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
“నా కూతురు అంటే నన్ను తీసేస్తారా?”
తన కూతురు విషయంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నా కూతురు అంటే నన్ను తీసేస్తారా? నాకు చెప్పాపెట్టకుండా నన్ను తీసేస్తారా?” అని ప్రశ్నించారు. తనకు జరిగిన పరిణామాలు భవిష్యత్తులో ఇతర నేతలకు కూడా ఎదురుకావచ్చని హెచ్చరించారు.
ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేతలు మౌనం వీడాలని పిలుపునిచ్చారు. “ఇబ్బంది పడుతున్న నేతలారా.. బయటకు రండి.. గళం విప్పండి. ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలపై నోరు విప్పండి. లేదంటే నష్టం తప్పదు” అని అన్నారు.
రేవంత్ సర్కార్‌కు సురేఖ ప్రశ్నలు
బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ప్రస్తావించిన సురేఖ.. ఒక బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి ఎలా తొలగించారో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముందుగా తనకు సమాచారం ఇవ్వకుండా పదవి తొలగించడం సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రభుత్వం తన వ్యవహార శైలిని మార్చుకోవాలని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీ, ప్రభుత్వంలో మార్పులు అవసరమని వ్యాఖ్యానించారు.
“మోనోపోలీ వ్యవహారం తప్పు. పదేళ్లు ముఖ్యమంత్రిని అని ఆయనకు ఆయనే చెప్పుకోవడం తప్పు. ఎమ్మెల్యే అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం కూడా తప్పు” అంటూ సురేఖ వ్యాఖ్యానించారు.
లేఖ విడుదల చేసిన కొండా సురేఖ
మీడియా సమావేశంలో కొండా సురేఖ ఓ లేఖను కూడా విడుదల చేశారు. తన భర్తరఫ్, పార్టీ అంతర్గత పరిణామాలు, తనపై జరిగిన పరిణామాలు, సుమంత్ వ్యవహారం తదితర అంశాలను ఆ లేఖలో ప్రస్తావించినట్లు తెలిపారు. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై తన అభిప్రాయాలను లేఖ ద్వారా స్పష్టంగా వెల్లడించినట్లు చెప్పారు.