మధిర: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చలో హైదరాబాద్ ను విజయవంతం చేయాలి
మధిర, సెప్టెంబర్ 9: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న నిర్వహించనున్న **‘చలో హైదరాబాద్–హక్కుల సాధన సభ’**ను విజయవంతం చేయాలని మధిర సంయుక్త కార్యాచరణ సమితి నాయకులు గుర్రం శ్రీనివాసరావు, ఆర్. రంగారావు, షేక్ నాగూర్ వలి పిలుపునిచ్చారు.
బుధవారం భోజన విరామ సమయంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాలను సందర్శించిన నాయకులు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను కార్యక్రమానికి తరలిరావాలని కోరారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..
తక్షణమే వేతన సవరణ సంఘం నివేదిక తెప్పించి ఫిట్‌మెంట్ ప్రకటించాలి
సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
పెండింగ్‌లో ఉన్న ఆరు కరువు భత్యాలను వెంటనే విడుదల చేయాలి
నూతన ఆరోగ్య పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
పెన్షనర్ల బకాయిలను నెలకు రూ.2,000 కోట్ల చొప్పున విడుదల చేయాలి
ఉద్యోగుల హక్కులు, సమస్యల సాధనే లక్ష్యంగా నిర్వహిస్తున్న సెప్టెంబర్ 10 కార్యక్రమానికి లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు హాజరై విజయవంతం చేయాలని నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ సమితి నాయకులు పఠాన్ బాజీఖాన్, పోలె సుధాకర్, జి. రజినీకాంత్, సత్యనారాయణ రెడ్డి, ప్రవీణ్, సాయి, మానస, బాగం వేణు, జి. వేణు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.