హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్ అక్టోబర్ 04/ఎన్ టుడే న్యూస్.
హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని లేబర్ అడ్డా వద్ద ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఈరోజు స్థానిక కాలనీవాసులు, కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చుట్టుపక్కల కాలనీవాసులు మాట్లాడుతూ.. లేబర్ అడ్డా కారణంగా ప్రతిరోజూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రోడ్లపైనే మూత్రవిసర్జన చేయడం, పేకాట ఆడటం, రోడ్డు పక్కనే నిద్రించడం వంటి కారణాలతో ముఖ్యంగా మహిళలు, స్థానిక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ లేబర్ అడ్డాను మరో ప్రాంతానికి తరలించాలని ఎమ్మెల్యేను కోరారు.దీనిపై సుధీర్ రెడ్డి స్పందిస్తూ.. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే జీవనోపాధి పొందుతున్న కార్మికులకు కూడా ఇబ్బంది కలగకుండా సమస్యకు పరిష్కారం చూపుతామని తెలిపారు. రేడియో స్టేషన్ సమీపంలోని ఫుట్‌పాత్ ప్రాంతంలో కార్మికుల కోసం మూత్రశాలలు, తాగునీటి సౌకర్యం, విశ్రాంతి తీసుకునేందుకు షెడ్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి కార్మికులు కూడా అంగీకారం తెలిపారు.
అదేవిధంగా స్థానిక ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడి.. లేబర్ అడ్డా వద్ద కార్మికులకు, స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
లేబర్ అడ్డాను ప్రక్క ప్రాంతానికి తరలించి, కార్మికులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడంపై చుట్టుపక్కల కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ శ్రీ కొప్పుల విఠల్ రెడ్డి, డివిజన్ భారాస పార్టీ అధ్యక్షులు శ్రీ చెన్నగోని శ్రీధర్ గౌడ్, గుత్త లక్ష్మారెడ్డి, దీపావళి శ్రీకాంత్ తో పాటు పలువురు కాలనీ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు.