లోకం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ నగర సంకీర్తన
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ఆదివారం ఉదయం సత్యసాయి సేవా కమిటీ ఆధ్వర్యంలో నగర సంకీర్తన వైభవంగా నిర్వహించారు. లోకం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని కాంక్షిస్తూ భక్తులు గ్రామ ప్రధాన వీధుల్లో నగర సంకీర్తన నిర్వహించారు. శివాలయం ప్రాంగణంలోని శిరిడీ సాయిబాబా మందిరం నుంచి ప్రారంభమైన సంకీర్తన గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా కొనసాగింది. భక్తులు ‘‘ఓం సాయి, శ్రీ సాయి, జయజయ సాయి’’, ‘‘శ్రీరామ, జయరామ, జయజయరామ’’ నామ పారాయణం చేస్తూ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా కమిటీ సభ్యులు డాక్టర్ జి. నరసింహారావు, సుగ్గల హనుమంతరావు, పాశం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్ చాలీసా పారాయణం
పెనుగొలను గ్రామంలోని బొడ్రాయి సెంటర్ వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఏకశిల విగ్రహం వద్ద శనివారం రాత్రి హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేసి, అనంతరం భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం బుస్కారౌతు సీతారామయ్య సహకారంతో వివిధ రకాల ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహక కమిటీ సభ్యులు బొలగాని నాగయ్య, కోట దాసు, పసుమర్తి లక్ష్మణరావు తదితరులు పర్యవేక్షించారు.