గణేష్ విగ్రహాల ఏర్పాటుపై నిర్వాహకులకు పోలీసుల కౌన్సెలింగ్
జంగారెడ్డిగూడెం: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో విగ్రహాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణ సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై నిర్వాహకులకు పోలీసులు అవగాహన కల్పించారు. జంగారెడ్డిగూడెం సీఐ ఎం.వి. సుభాష్, తడికలపూడి మహిళా ఎస్‌ఐ వల్లి పద్మ ఆధ్వర్యంలో తడికలపూడి శివాలయం వద్ద గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయనున్న ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ విగ్రహాల ఏర్పాటుకు ముందుగా ఆన్‌లైన్ అనుమతులు తప్పనిసరిగా పొందాలని సూచించారు. విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలని, ఉత్సవాల కారణంగా ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఉత్సవాల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో నిర్వహించాలని కోరారు. పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో సీఐ ఎం.వి. సుభాష్, మహిళా ఎస్‌ఐ వల్లి పద్మతో పాటు ఉత్సవ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.