మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ఎన్జీటీలో ఎదురుదెబ్బ
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ రిటైర్డ్ ఇంజినీర్లు చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ దక్షిణ బెంచ్‌ను ఆశ్రయించారు. మూసీ పరివాహక ప్రాంతం మొత్తం 55 కిలోమీటర్లు ఉండగా, ప్రభుత్వం కేవలం 20 కిలోమీటర్ల పరిధిని మాత్రమే పరిశీలించిందని పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే ప్రాంతంలో మృగవాణి జాతీయ పార్కు కూడా ఉందని పేర్కొన్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల పరిసరాల్లో భారీ నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంపై కూడా రిటైర్డ్ ఇంజినీర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన చెన్నై ఎన్జీటీ దక్షిణ బెంచ్.. పర్యావరణ అనుమతుల జారీకి సంబంధించిన అంశాలతో పాటు ప్రాజెక్టు అమలుకు సంబంధించిన వివరాలు, తమ వాదనలను వెంటనే సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 16కు వాయిదా వేసింది.