తెలంగాణలో భారీగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు
రాష్ట్రంలో కొత్తగా 1,010 సీట్లు అందుబాటులోకి..
తాజా సీట్ మ్యాట్రిక్స్ విడుదల చేసిన ఎన్ఎంసీ
తెలంగాణ బ్యూరో / N Today News: తెలంగాణలోని మెడికల్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ (ఎంబీబీఎస్) కోర్సుల సీట్ మ్యాట్రిక్ను నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) తాజాగా విడుదల చేసింది. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు భారీగా పెరిగాయి. మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు(ఎంఏఆర్పీ)తో పాటు అప్పీల్ కమిటీల ఆమోదం పొందిన సీట్లను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించింది. తాజా జాబితా ప్రకారం తెలంగాణలో మొత్తం 66 మెడికల్ కాలేజీలు ఉండగా, వాటిలో మొత్తం 10,450 ఎంబీ బీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 36 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 4,400 సీట్లు, 30 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 6,050 సీట్లు ఉన్నట్లు ఎన్ఎంసీ వెల్లడించింది. కాగా ప్రభుత్వ మెడికల్కాలేజీల్లో మొత్తం 110 సీట్లు పెరగగా.. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 900 సీట్లు పెరిగాయి. రాష్ట్రవ్యా ప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లో కలిపి మొత్తం 1,010 ఎంబీబీఎస్ సీట్లు పెరగడం గమనార్హం. ఇందులో కొత్తగా ఏర్పాటైన రాజా రాజేశ్వరి మహిళా మెడికల్ కాలేజీకి చెందిన 150 సీట్లు కూడా ఉన్నా యి. పెరిగిన 1,010 సీట్లలో సుమారుగా 800 నుంచి 840 వరకు ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఇచ్చిన అనుమతులకు అదనంగా, తాజాగా ప్రకటించిన జాబితాలో రాష్ట్రంలోని పలు ప్రైవేట్ కాలేజీల్లో మరో 200 సీట్లు పెరిగాయి. డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (చేవెళ్ల), మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(వికారాబాద్), మెడిసిటీ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఘన్పూర్), ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ(మహబూబ్నగర్)ల్లో ఒక్కో దానికి 50 చొప్పున మొత్తం 200 సీట్లు పెరిగాయి. అనుమ తించిన సీట్ల కంటే అదనంగా ఎలాంటి అడ్మిషన్లు చేపట్టకూడదని మెడికల్ కాలేజీల యాజమాన్యాలు, కౌన్సెలింగ్ కమిటీలను ఎన్ఎంసీ ఆదేశించింది. అదనంగా విద్యార్థులను చేర్చుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అనుమతి పొందిన ప్రైవేట్ కాలేజీలు 7 రోజుల్లోగా ఈ-బ్యాంక్ గ్యారెంటీలను సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ సీట్ల పెంపుతో రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసించాల నుకునే నీట్ ఆశావహులకు, ముఖ్యంగా కటాఫ్ మార్కుల సరిహద్దుల్లో ఉన్న విద్యార్థులకు భారీ ఊరట కలగనుంది.