మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
సింగిల్ విండో ఈ-పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి: ఎస్ఐ ప్రసాదరావు
మునగపాక | Ntoday News
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసే గణేష్ మండపాలు, పందిళ్లకు తప్పనిసరిగా పోలీసు శాఖ నుంచి అనుమతులు పొందాలని మునగపాక ఎస్ఐ పి. ప్రసాదరావు సూచించారు.
గురువారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. గణేష్ ఉత్సవాల నిర్వహణలో భాగంగా మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీసు శాఖ రూపొందించిన సింగిల్ విండో ఈ-పోర్టల్ ద్వారా ముందస్తుగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత పోలీసు అధికారులు పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారని పేర్కొన్నారు. గణేష్ మండపాలు, ఊరేగింపులు, నిమజ్జనాలకు సంబంధించిన వివరాలను ముందుగానే నమోదు చేయడం ద్వారా భద్రతా ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.
ఉత్సవ కమిటీలు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందుగానే అనుమతుల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఎస్ఐ ప్రసాదరావు కోరారు. ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసు శాఖకు సహకరించాలని సూచించారు.