నాగ్‌పూర్: బ్యాంకులో పట్టపగలే దొంగ హల్‌చల్.. కారం పొడి చల్లి రూ.4.5 లక్షలు చోరీ
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పట్టపగలే ఓ దుండగుడు బ్యాంకులోకి చొరబడి నగదు చోరీకి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బ్యాంకు సిబ్బందిపై కారం పొడి చల్లి గందరగోళం సృష్టించిన దుండగుడు.. అదే అదునుగా కౌంటర్‌లో ఉన్న రూ.4.5 లక్షల నగదును ఎత్తుకెళ్లాడు. కారం పొడి కారణంగా బ్యాంకు సిబ్బంది ఇబ్బందులకు గురై ఉరుకులు పరుగులు పెట్టడంతో దుండగుడికి ఎదురులేకుండా పోయింది. నగదును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై సమాచారం అందుకున్న నేర విభాగం పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దుండగుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు కేవలం అరగంటలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడి వద్ద నుంచి చోరీకి గురైన రూ.4.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పట్టపగలే బ్యాంకులోకి చొరబడి కారం పొడి చల్లి నగదు దోచుకోవడం నాగ్‌పూర్‌లో తీవ్ర కలకలం రేపింది. ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.