గుడిపాల మండలం లో విషాదం
గుడిపాల మండలంలో విషాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి కూలి ఇద్దరు మృతి
మందకృష్ణాపురంలో ప్రమాద స్థలాన్ని పరిశీలించిన వైసీపీ ఇన్‌చార్జ్ విజయానంద రెడ్డి
చిత్తూరు | Ntoday News
చిత్తూరు జిల్లా గుడిపాల మండలం మందకృష్ణాపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న చర్చి భవనం కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. చర్చి భవనానికి స్లాబ్ వేస్తున్న సమయంలో సపోర్టుగా ఉన్న పరంజా కూలిపోవడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరికొందరు గాయపడినట్లు స్థానికంగా సమాచారం.
ప్రమాద విషయం తెలుసుకున్న చిత్తూరు వైసీపీ ఇన్‌చార్జ్ ఎం.సి. విజయానంద రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సహాయక చర్యలపై వివరాలు తెలుసుకున్నారు.
మృతుల కుటుంబాలను పరామర్శిస్తూ విజయానంద రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి, తగిన సహాయం అందించాలని కోరారు.
ఈ విషాద ఘటనతో మందకృష్ణాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆయన ఆకాంక్షించారు.