తిరువూరు: వినాయక చవితికి ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి సూర్య రెస్టారెంట్‌కు వెళ్లే రోడ్డులోని శ్రీ సిద్ధి వినాయక కార్పెంటర్ అండ్ అల్యూమినియం వర్క్స్ వద్ద ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.
బ్రహ్మశ్రీ దేవరకొండ మల్లికార్జున చారి గత ఆరు సంవత్సరాలుగా కృష్ణానది మట్టితో తయారు చేసిన స్వచ్ఛమైన మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా మట్టి విగ్రహాల్లో కొన్ని విత్తనాలను ఉంచుతున్నారు.
విగ్రహాన్ని ఇంటి వద్దే పెరటిలో నిమజ్జనం చేస్తే మట్టి కరిగిపోయి అందులోని విత్తనాల నుంచి మొక్కలు మొలిచేలా ఈ విగ్రహాలను తయారు చేసినట్లు మల్లికార్జున చారి తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు మొక్కల పెంపకంపై అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ సెప్టెంబర్ 13న మధ్యాహ్నం 3 గంటల నుంచి సెప్టెంబర్ 14న ఉదయం 11 గంటల వరకు కొనసాగనుంది. తిరువూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విశ్వబ్రాహ్మణ సేవా సంఘం తిరువూరు పట్టణ, మండల శాఖ కోరింది.
ఈ కార్యక్రమానికి తిరువూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాల తయారీ, ఉచిత పంపిణీకి ముందుకు వచ్చిన దేవరకొండ మల్లికార్జున చారిని విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు అభినందించారు.