తిరువూరు: ఎస్‌బీఐ ఉద్యోగుల ధర్నా.. కేంద్ర విధానాలపై నిరసన
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ ఎదుట శుక్రవారం బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మెలో భాగంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు ఈ ఆందోళన చేపట్టారు. ఉద్యోగులు బ్యాంకు శాఖ ఎదుట బైఠాయించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బ్యాంకింగ్ రంగంలో వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. పనితీరు ఆధారిత ప్రోత్సాహక విధానంలో చేసిన మార్పులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. ఉద్యోగుల వేతనాలు, పని పరిస్థితులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించాలని ఈ సందర్భంగా ఎస్‌బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ ప్రాంతీయ కార్యదర్శి బి.ఎల్.హెచ్. ప్రసాద్ కోరారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే ఈ నెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు మరింత తీవ్రస్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అప్పటికీ స్పందన లేకుంటే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం అవసరమైతే మరింత తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.