వీడిన బొల్లారం వెపన్స్ మిస్సింగ్ మిస్టరీ
మద్రాస్ రెజిమెంట్ నుంచి మాయమైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం.. మాజీ సైనికుడి అరెస్ట్
హైదరాబాద్ | సిటీ క్రైం | Ntoday News
సికింద్రాబాద్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆర్మరీ నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి మాయమైన ఘటనకు సంబంధించిన మిస్టరీని మల్కాజిగిరి పోలీసులు ఛేదించినట్లు సమాచారం. దర్యాప్తులో మాజీ సైనిక అధికారి ప్రమేయం ఉన్నట్లు తేలినట్లు తెలుస్తోంది. మాయమైన ఆయుధాలను హైదరాబాద్‌లోని ఓ ఇంట్లో దాచినట్లు గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. తాజాగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా నివేదించింది.
ఆగస్టు 30 రాత్రి బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లోని ఆయుధాల నిల్వ కేంద్రం, మందుగుండు సామగ్రి భద్రపరిచే ప్రాంతంలో చోరీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. 12 ఆయుధాలతో పాటు భారీగా మందుగుండు సామగ్రి మాయమైన ఘటనపై బొల్లారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రారంభ దర్యాప్తులో నాలుగు AK-203 రైఫిళ్లు, ఒక INSAS రైఫిల్, పిస్టళ్లు, మ్యాగజైన్లు, 1,800కు పైగా రౌండ్ల మందుగుండు సామగ్రి మాయమైనట్లు నివేదికలు వెల్లడించాయి.
అత్యంత భద్రత ఉండే మిలటరీ కాంపౌండ్ నుంచి ఆయుధాలు బయటకు ఎలా వెళ్లాయన్న అంశం పోలీసులకు సవాల్‌గా మారింది. కేసు దర్యాప్తులో మిలటరీ ఇంటెలిజెన్స్, పోలీసులు తదితర విభాగాలు పాల్గొన్నట్లు సమాచారం. ఆర్మరీ వద్ద విధుల్లో ఉన్న సిబ్బందితో పాటు భద్రతా వ్యవస్థ, ఆయుధాల రికార్డులు, సీసీటీవీ వ్యవస్థపై కూడా అధికారులు దృష్టి సారించారు.
మిస్సింగ్ అయిన ఆయుధాలు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లకముందే వాటిని స్వాధీనం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆయుధాలను ఎందుకు చోరీ చేశారు, ఎవరికి తరలించేందుకు ప్రయత్నించారు, భద్రతా వలయాన్ని ఎలా దాటారు వంటి అంశాలపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడి పాత్ర, ఆయుధాలను దాచిన ప్రదేశం, చోరీకి సంబంధించిన పూర్తి వ్యవహారంపై పోలీసుల అధికారిక ప్రకటనతో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.