వినాయక మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి
మధిర: వినాయక చవితి పండుగ సందర్భంగా మధిర మండలంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలు ప్రతిష్ఠించే వారు తప్పనిసరిగా ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని రూరల్ ఎస్సై విశ్వతేజ సూచించారు. ఉత్సవ కమిటీలు ఉచిత ఏకగవాక్ష విధానంలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మండపాల ఏర్పాటుకు స్థల యజమాని అనుమతితో పాటు పంచాయతీ, అగ్నిమాపక, విద్యుత్ శాఖల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్సై సూచించారు. రహదారులకు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగేలా మండపాలు, బ్యానర్లు ఏర్పాటు చేయరాదన్నారు. లౌడ్‌స్పీకర్లను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. డీజేలు, మందుగుండు సామగ్రి వినియోగించరాదని హెచ్చరించారు. ముఖ్యంగా నిమజ్జన కార్యక్రమం సందర్భంగా మద్యం, మత్తు పదార్థాలు సేవించి పాల్గొంటే చట్టపరమైన చర్యలు తప్పవని రూరల్ ఎస్సై విశ్వతేజ హెచ్చరించారు.