పెనుగొలనులో ఘనంగా దిగ్విజయ్ దివస్ కార్యక్రమం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం దిగ్విజయ్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వామి వివేకానంద జీవిత విశేషాలు, ఆయన అందించిన సందేశాలను కార్యక్రమంలో పాల్గొన్న వారు వివరించారు. 1893 సెప్టెంబర్ 11న అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంటు సభలో స్వామి వివేకానంద చేసిన చారిత్రాత్మక ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందిందని వక్తలు తెలిపారు. తన ప్రసంగాన్ని సోదర సోదరీమణులారా అనే ఆత్మీయ సంబోధనతో ప్రారంభించగా, సభలోని వారంతా లేచి నిలబడి కొన్ని నిమిషాల పాటు కరతాళధ్వనులతో స్పందించారని పేర్కొన్నారు. స్వామి వివేకానంద తన ప్రసంగం ద్వారా భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం, ఆధ్యాత్మికత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని తెలిపారు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఆ చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా ప్రతి ఏడాది సెప్టెంబర్ 11న దిగ్విజయ్ దివస్‌ను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు స్వామి వివేకానంద చైతన్య సందేశాలతో కూడిన కరపత్రాలను గ్రామస్తులు, విద్యార్థులకు పంపిణీ చేశారు. యువత స్వామి వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, జనసేన మండల నాయకుడు సూరం శెట్టి రామయ్య, ఉపాధ్యాయురాలు తోట సునీత, రాళ్లచర్ల జగన్నాథం, దేవర నరసింహారావు, వూట్ల కృష్ణ, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.