48 ఏళ్లుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం
మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి
ప్రతిభ చూపిన విద్యార్థులకు మెమెంటోల పంపిణీ
ధర్మపురి
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి పేర్కొన్నారు. ధర్మపురి పట్టణంలోని కాశెట్టి వాడ గణేష్ మండలి ఆధ్వర్యంలో కాశెట్టి వాడ కుటుంబ సభ్యులు నిర్వహించిన 'తెలంగాణ జానపద ఆట–పాటల' సాంస్కృతిక కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. కాశెట్టి వాడ గణేష్ మండలి ఆధ్వర్యంలో గత 48 సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలతో పాటు నిరంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం చాలా అభినందనీయమని కొనియాడారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను గుర్తించి, వారిని కళారంగంలో ముందుకు నడిపించేందుకు మండలి సభ్యులు చేస్తున్న కృషి ఎంతో గొప్పదని తెలిపారు.
అనంతరం సాంస్కృతిక పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి, వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మెమెంటోలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు సంగి ఆనంద్, చుక్క సంధ్య, చిపిరిశెట్టి రాజేష్, కొమురెల్లి పవన్ కుమార్, కాశెట్టి వాడ గణేష్ మండలి సభ్యులు, విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొన్నారు.