పెనుగొలనులో పలుచోట్ల శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
ఘనంగా ప్రత్యేక పూజలు.. చిన్నారులకు నృత్య పోటీలు.. కనులపండువగా ఉట్టి కొట్టే కార్యక్రమం
పెనుగొలను: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భజనలు, పారాయణాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో చిన్నారులకు నృత్య పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులు అందజేశారు.
అదే దేవాలయంలో ఆలయ అర్చకులు వి. వెంకటేశ్వరస్వామి ఆధ్వర్యంలో శ్రీ రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు భగవన్నామ పారాయణం చేస్తూ దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
యాదవ బజార్లో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే కార్యక్రమం కనులపండువగా జరిగింది. చిన్నారులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నిర్వహణ కమిటీ సభ్యులు ఎనుముల సురేష్, లేళ్ళ గోపాలరావు, గుమ్మ గోపరాజు, ఇమ్మడి కృష్ణ, గోసు గంగరాజు ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు.
శ్రీ రంగనాయకస్వామి ఆలయంలో ఆలయ అర్చకులు తూమాటి యోగానందాచార్యులు శ్రీ రంగనాయకస్వామికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మహిళా భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం, భజన కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆలయ అర్చకులు దాములూరి సత్యనారాయణ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ లలితాదేవి పారాయణం, భజన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.