పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
మేడికొండూరు: మండలంలోని పేరేచర్ల గ్రామంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారంటూ స్థానికులు ఆరోపించారు. శుక్రవారం అర్ధరాత్రి పేరేచర్లలోని 17వ నంబర్ రేషన్ దుకాణం నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నట్లు తెలిపారు.
బియ్యం తరలింపుపై స్థానికులు నిర్వాహకులను ప్రశ్నించగా, తమకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ వారు దురుసుగా, నిర్లక్ష్యంగా వ్యవహరించారని గ్రామస్తులు ఆరోపించారు.
రేషన్ బియ్యం తరలింపుపై సమగ్రంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించి, రేషన్ బియ్యం అక్రమ తరలింపును అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.