తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల్లో పాల్గొనండి
జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులకు పవన్ కళ్యాణ్ పిలుపు
అక్టోబర్ 28: అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సహాయ చర్యల్లో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొనాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని కోస్తా జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపుతోందని, తుపాను తీరం దాటినప్పటికీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
లోతట్టు, తీర ప్రాంతాల్లోని ప్రజలను సహాయక శిబిరాలకు తరలించిన నేపథ్యంలో వారికి అవసరమైన ఆహారం, పాలు, ఇతర నిత్యావసర వస్తువులను అందించాలని జనసేన శ్రేణులను కోరారు. అత్యవసర వైద్య సహాయం అవసరమైన వారికి అండగా నిలవాలని సూచించారు.
అదేవిధంగా తుపాను కారణంగా రహదారులపై కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించే పనుల్లో నిమగ్నమైన సిబ్బందికి సహకరించాలని పవన్ కళ్యాణ్ కోరారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచి, సహాయక చర్యల్లో బాధ్యతాయుతంగా పాల్గొనాలని జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు.