యువతకు అవకాశాల దిశగా PM ఇంటర్న్‌షిప్ యాప్
న్యూఢిల్లీ: యువతకు విద్య పూర్తయిన తర్వాత ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PM ఇంటర్న్‌షిప్ పథకంపై అవగాహన కల్పిస్తోంది. యువతకు పరిశ్రమల అనుభవాన్ని అందించడంతో పాటు, నైపుణ్యాలను మెరుగుపరచి ఉపాధి అవకాశాలకు సిద్ధం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా పేర్కొంటున్నారు.
దేశంలోని ప్రముఖ 500 కంపెనీల్లో ఐదేళ్ల కాలంలో కోటి ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. వివిధ రంగాల్లో పనిచేసే ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ ద్వారా యువతకు పరిశ్రమల పని విధానం, వృత్తిపరమైన నైపుణ్యాలపై ప్రత్యక్ష అనుభవం లభించే అవకాశం ఉంటుంది.
యువత తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న ఇంటర్న్‌షిప్ అవకాశాలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. చదువుతో పాటు ప్రాక్టికల్ అనుభవాన్ని పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో మెరుగైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
యువతలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో వారిని తీర్చిదిద్దడం ద్వారా స్వయం ఆధారిత భారతదేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని సూచిస్తున్నారు.