భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
చింతూరు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చింతూరు మండలం పొలవరం జిల్లా పరిధిలోని అల్లిగూడెం బ్రిడ్జిపై రహదారి దెబ్బతిని పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడ్డాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి మధ్యభాగంలో గుంతలు ఏర్పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని పేర్కొన్నారు.
ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని అత్యవసరంగా ఆస్పత్రులకు తరలించాల్సిన సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గర్భిణులను ఆస్పత్రులకు తరలించే సమయంలో అంబులెన్స్‌లు కూడా బ్రిడ్జిపై సులభంగా ప్రయాణించలేని పరిస్థితి నెలకొందని అల్లిగూడెం గ్రామస్థులు పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడితే ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అల్లిగూడెంతో పాటు మల్లంపేట, నర్సింగపేట, పల్లగూడెం, నారకొండ తదితర గ్రామాల ప్రజలు ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారని, బ్రిడ్జి దెబ్బతినడంతో ఆయా గ్రామాల ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడంతో పాటు, సమస్యకు శాశ్వత పరిష్కారంగా కొత్త బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారి పరిస్థితిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.