రైతు సమస్యలపై రాజకీయం తగదు.. పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం
రైతు సమస్యలపై రాజకీయం తగదు.. పొగాకు రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం: ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఏలూరు, ఆగస్టు 3: అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది పొగాకు ధరలు తగ్గి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారికి గిట్టుబాటు ధర కల్పించి అన్ని విధాలా ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. రైతు సమస్యలను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని ఆయన అన్నారు.
ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్, మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి, పొగాకు బోర్డు అధికారులతో పలుమార్లు చర్చించినట్లు వెల్లడించారు.
బ్రైట్ రకం పొగాకుకు కిలోకు రూ.240, మీడియం రకానికి రూ.190, లో గ్రేడ్ పొగాకుకు రూ.110 కంటే తక్కువ కాకుండా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకున్నామని, దీంతో ధరలు క్రమంగా మెరుగుపడుతున్నాయని తెలిపారు.
లో గ్రేడ్ పొగాకు రైతులకు బ్యారెల్‌కు రూ.50 వేల వడ్డీ లేని రుణ సదుపాయం కల్పించేందుకు పొగాకు బోర్డు అంగీకరించిందన్నారు. అలాగే ధరల లోటు భర్తీ కోసం కిలోకు రూ.20 అదనపు మద్దతు ధర ఇవ్వాలని ప్రతిపాదించామని, అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కిలోకు రూ.10 చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకు రూ.100 కోట్లకు పైగా ప్రభుత్వంపై భారం పడుతున్నప్పటికీ రైతు సంక్షేమమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
గత ఏడాది కొనుగోలు చేసిన పొగాకు నిల్వలు ఇంకా గోదాముల్లో ఉన్నప్పటికీ ఈ ఏడాది కూడా కొనుగోళ్లు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం బాధాకరమని విమర్శించారు.
యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్ మందగమనం, కొనుగోలుదారుల కొరత వల్ల ధరలు ప్రభావితమయ్యాయని పేర్కొన్న ఎంపీ, పొగాకు బోర్డు అనుమతి మేరకే సాగు చేయాలని, అనుమతి లేకుండా నారుమడులు వేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.
పొగాకుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి పెట్టాలని సూచించిన ఆయన, ప్రస్తుతం ఆయిల్‌పామ్ గెలలకు టన్నుకు రూ.24 వేల వరకు ధర లభిస్తోందని చెప్పారు. భవిష్యత్తులో ఈ పంటకు మరింత డిమాండ్ పెరిగే అవకాశముందని, పొగాకు, మామిడి రైతులు ఆయిల్‌పామ్ సాగును పరిశీలించాలని సూచించారు.
ప్రజాదర్బార్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు వినతిపత్రాలు సమర్పించారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన నంబూరు రామయ్యకు వైద్య చికిత్స కోసం రూ.8 లక్షల విలువైన ఎల్‌వోసీ (LOC) లేఖను ఎంపీ అందజేశారు.