సిరిపురం విద్యార్థి మహేష్‌కు ఎంబీబీఎస్‌లో సీటు
ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించిన కనకపుడి మహేష్
మధిర మండలం, సిరిపురం: పేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుంటూనే పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకున్న సిరిపురం గ్రామానికి చెందిన కనకపుడి మహేష్ ఎంబీబీఎస్‌లో సీటు సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు.
ములుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన మహేష్ ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో 412 మార్కులు సాధించాడు. సిరిపురం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యను అభ్యసించిన మహేష్ 600 మార్కులకు గాను 550 మార్కులు సాధించాడు. అనంతరం మధిరలోని మైనార్టీ గురుకుల కళాశాలలో బైపీసీ గ్రూపులో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసి 1000 మార్కులకు 958 మార్కులు సాధించాడు.
మహేష్ తండ్రి కనకపుడి నరసింహారావు సా మిల్లులో రోజువారీ కూలీగా పనిచేస్తుండగా, తల్లి కనకపుడి సునీత అనారోగ్య కారణాలతో ఇంటి వద్దే ఉంటోంది. అత్యంత పేద కుటుంబానికి చెందిన మహేష్ కార్పొరేట్ విద్యాసంస్థలకు వెళ్లకుండా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకుంటూ వైద్య విద్యలో సీటు సాధించడం విశేషం.
కుటుంబ ఆర్థిక పరిస్థితులు, పరిమిత వనరులు తన లక్ష్యానికి అడ్డంకిగా మారకుండా కష్టపడి చదివిన మహేష్ తన తల్లిదండ్రుల కలను నెరవేర్చాడు. ప్రతిభ, పట్టుదల ఉంటే పేదరికం విజయానికి అడ్డుకాదని తన విజయంతో నిరూపించాడు.
మహేష్ ఎంబీబీఎస్‌లో సీటు సాధించడంపై సిరిపురం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, మధిర మైనార్టీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మహేష్‌ను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.