సత్తుపల్లిలో కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశం
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి: ఎమ్మెల్యే రాగమయి
సత్తుపల్లి | Ntoday News
సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశం బుధవారం సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా విజయ్ కుమార్ దయానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజలకు స్పష్టంగా వివరించేలా సోషల్ మీడియా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ పెట్టెం నవీన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో సోషల్ మీడియా కార్యకర్తలు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.
రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ విజయ్ కుమార్ దయానంద్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు వాస్తవాలతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలకు వాస్తవాలను చేరవేయడంలో సోషల్ మీడియా కీలక వేదికగా మారిందని, పార్టీ శ్రేణులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ పెట్టెం నవీన్, రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, సత్తుపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్‌చార్జి కిషోర్ పోతురాజు, నియోజకవర్గంలోని ఐదు మండలాలు, టౌన్ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, గ్రామ శాఖల సోషల్ మీడియా అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.