షాద్‌నగర్‌లో కాంగ్రెస్ భారీ నిరసన....
షాద్‌నగర్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. బీఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన రఘునాయక్
అసెంబ్లీ గొడవలకు కేసీఆరే సూత్రధారి.. కేటీఆర్, హరీశ్, తాతా మధు, నవీన్ రెడ్డిలు పాత్రధారులు
దళిత స్పీకర్‌ను అవమానించడం దుర్మార్గం.. మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించడంపై కాంగ్రెస్ ఆగ్రహం
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, తాతా మధుల దిష్టిబొమ్మల దహనం
షాద్‌నగర్‌లో మార్మోగిన కాంగ్రెస్ నినాదాలు.. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు
షాద్‌నగర్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న వివాదాలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగకుండా వివాదాలకు తెరతీసింది మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆరేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గిరిజన ఆదివాసి విభాగం సమన్వయకర్త, సీనియర్ నేత పి.రఘునాయక్ ఆరోపించారు. కేసీఆర్ వెనుక ఉండి వ్యూహం రచిస్తే.. కేటీఆర్, హరీశ్ రావు, తాతా మధు, నవీన్ రెడ్డిలు ఆ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణ కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, తాతా మధుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు హోరెత్తించారు. ఫరూక్‌నగర్, కొత్తూరు, కొందుర్గు, కేశంపేట, నందిగామ, చౌదరిగూడ, షాద్‌నగర్‌తో పాటు కొత్తూరు మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, పార్టీ అధ్యక్షులు భారీ సంఖ్యలో కార్యక్రమానికి తరలివచ్చారు.
ఫామ్‌హౌస్‌లోనే పథకం.. అసెంబ్లీ గేటు వద్ద హంగామా
దిష్టిబొమ్మల దహనం అనంతరం రఘునాయక్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ పథకం రూపొందించారని ఆరోపించారు. ఆ వ్యూహంలో భాగంగానే మరుసటి రోజు అసెంబ్లీ గేటు వద్ద హంగామా సృష్టించారని విమర్శించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై సమాధానం చెప్పే పరిస్థితి లేకపోవడంతోనే వివాదాలను సృష్టిస్తూ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
మహిళా ఎమ్మెల్యేలను సైతం రాజకీయ వివాదాల్లోకి లాగడం దురదృష్టకరమన్నారు. మహిళా పోలీసులతో కొందరు బీఆర్‌ఎస్ నాయకులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ, అందుకు సంబంధించిన ఫొటోలను పోస్టర్ల రూపంలో ప్రదర్శించారు. మహిళలను గౌరవించకుండా వ్యవహరించిన తీరు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
దళిత స్పీకర్‌ను అవమానించడం దుర్మార్గం
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను రఘునాయక్ తీవ్రంగా ఖండించారు. దళిత శాసనసభాపతిని అసభ్య పదజాలంతో దూషించడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. అనంతరం ఆ వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేయడం మరింత బాధాకరమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందన్నారు.
డప్పుల కార్యక్రమంపై మరోసారి విమర్శలు
కేసీఆర్‌ను మేల్కొలిపే కార్యక్రమం పేరుతో నిర్వహించిన వెయ్యి డప్పుల కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ రఘునాయక్ విమర్శలు గుప్పించారు. మాదిగలు డప్పులు కొడితే ఫామ్‌హౌస్ చుట్టూ పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసుకున్నారనే ఆరోపణలు దళితులను అవమానించేలా ఉన్నాయని అన్నారు. ఇలాంటి చర్యలు సమాజంలో సామాజిక విభజనలకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మేమెవరి చావును కోరుకోం
కాంగ్రెస్ పార్టీ ఎవరి చావునూ కోరుకోదని రఘునాయక్ స్పష్టం చేశారు. ‘అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలి’ అనే సిద్ధాంతంతో కాంగ్రెస్ ముందుకు సాగుతోందన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెయ్యి చావు డప్పుల కార్యక్రమంపై చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ నేతలు వక్రీకరించి రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ నేతల విమర్శలకు కాంగ్రెస్ భయపడబోదని, ప్రజలకు వాస్తవాలు తెలుసని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షానికి ధీటుగా సమాధానం చెప్పగల నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితమై వివాదాలకు ఆజ్యం పోస్తున్నారని రఘునాయక్ విమర్శించారు.
భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
కార్యక్రమంలో షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు విశాల శ్రావణ్ రెడ్డి, సీనియర్ నాయకులు చెంది తిరుపతి రెడ్డి, కృష్ణ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజు గౌడ్, జగదీష్ అప్పా తదితరులతో పాటు వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, యువజన కాంగ్రెస్ నేతలు, మహిళా కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ, గిరిజన విభాగాల నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.