సంగారెడ్డి : లంచం తీసుకుంటూ విద్యాశాఖ అధికారి పట్టుబాటు
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రైవేట్ కళాశాల తనిఖీ చేసి అనుకూల నివేదిక ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన విద్యాశాఖ అధికారి గోవింద రాం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలను తనిఖీ చేసిన అనంతరం సానుకూల నివేదిక ఇవ్వాలంటే రూ.50 వేల లంచం ఇవ్వాలని అధికారి డిమాండ్ చేసినట్లు సమాచారం. గత వారం బాధితుడు రూ.30 వేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన రూ.20 వేల కోసం అధికారి ఫోన్ చేసి డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఈ క్రమంలో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శాఖ కార్యాలయంలో రూ.20 వేల లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం గోవింద రాంను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.
అనంతరం కార్యాలయంలో అధికారులు తనిఖీలు నిర్వహించి సంబంధిత ఆధారాలను సేకరించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.