BREAKING
thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● నంద్యాల టూటౌన్ సీఐగా జి. సుధాకర్ రెడ్డి బాధ్యతలు thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● గుంటూరులో నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపులు thumb ● ఎర్రగుంట్ల పీహెచ్‌సీకి స్వచ్ఛాంధ్ర అవార్డు thumb ● మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ సాధించిన ఆత్మకూరు యువకుడు thumb ● నంద్యాల టూటౌన్ సీఐగా జి. సుధాకర్ రెడ్డి బాధ్యతలు thumb ● వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి thumb ● అంకంపాలెం, వెలిచెరులో స్వచ్ఛత–సేవా సంకల్ప కార్యక్రమాలు thumb ● వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం
Date of Publish : 04 October 2026, 11:58 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఖమ్మం అల్లీపురంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Oct, 2026 - 11:58 AM
10 వీక్షణలు

20 ఎకరాల్లో నిర్మాణం.. ఈ నెల 12న భూమిపూజ
రూ.100 కోట్ల విలువైన భూమి కేటాయింపు.. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ఖమ్మం అభివృద్ధికి చర్యలు

ఖమ్మం: ఖమ్మం నగరంలో ఆధ్యాత్మిక వైభవాన్ని పెంపొందించే దిశగా అల్లీపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ ఆలయానికి కేటాయించిన భూమి విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 12న ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

అల్లీపురంలో ఆలయ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి పరిశీలించారు. భద్రాద్రి రాముడు కొలువైన ఖమ్మం జిల్లాలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టడం సంతోషకరమని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలయ నిర్మాణానికి ఆమోదం తెలిపారని, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుతో సమన్వయం చేసుకుంటూ పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

అమరావతి ఆలయ నమూనాలో నిర్మాణం

అమరావతిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నమూనాలోనే అల్లీపురంలో ఆలయాన్ని నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 12న నిర్వహించనున్న భూమిపూజ కార్యక్రమానికి భక్తులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మంతో పాటు నల్గొండ, వరంగల్ తదితర జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చేలా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.

ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ఖమ్మం

ఖమ్మం నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ ఆలయం, స్వామినారాయణ విద్యాసంస్థలు తదితర నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులతో నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం పెరగడంతో పాటు పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా విశాలమైన పార్కింగ్ సౌకర్యంతో హరిత హోటల్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

ధంసలాపురం ఎగ్జిట్, ఇంటిగ్రేటెడ్ స్కూల్, స్వామినారాయణ విద్యాసంస్థలు, ఇస్కాన్ ఆలయం, శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం తదితర అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన భూసేకరణను రైతులతో సమన్వయం చేసుకుంటూ పూర్తి చేసిన అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డిని మంత్రి అభినందించారు.

అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష

ఖమ్మం నగరానికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజన్ కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించి, అవసరమైన భూసేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగరంలో చేపడుతున్న రోప్‌వే, కేబుల్ బ్రిడ్జి, మెడికల్ కాలేజీ, మున్నేరు రిటైనింగ్ వాల్ తదితర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి ఈ పనులను ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం ప్రాంతంలో గుర్తించిన అక్రమ మైనింగ్‌పై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

భూమిపూజకు పటిష్ట ఏర్పాట్లు

ఆలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పటిష్టంగా చేపడతామని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఖమ్మం నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

అల్లీపురం ప్రాంతం ఆధ్యాత్మిక ప్రాంగణంగా రూపుదిద్దుకోనుందని సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తెలిపారు. తిరుమల ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించేలా ఆలయ నిర్మాణం జరగనుందని రాయల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాను ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అభివృద్ధి చేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేస్తున్న కృషిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.