ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక కాని వారికి రూ.10 వేల రిఫండ్
దరఖాస్తు సమయంలో చెల్లించిన మొత్తాన్ని నేటి నుంచి తిరిగి చెల్లింపు
హైదరాబాద్ | Ntoday News
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకుని ఎంపిక కాని వారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తు సమయంలో చెల్లించిన రూ.10 వేల మొత్తాన్ని నేటి నుంచి రిఫండ్ చేయనున్నట్లు హౌసింగ్ బోర్డు వర్గాలు వెల్లడించాయి.
దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు నమోదు చేసిన బ్యాంకు ఖాతాల్లోకే ఈ మొత్తాన్ని జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
అదేవిధంగా దరఖాస్తు సమయంలో ఫోన్ నంబర్లు తప్పుగా నమోదయ్యాయని పలువురు లబ్ధిదారులు వెల్లడించడంతో, వాటిని సరిచేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు హౌసింగ్ బోర్డు వర్గాలు తెలిపాయి.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం 16 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 60,720 దరఖాస్తులు అందగా, పరిశీలన అనంతరం దాదాపు 40 వేల మంది ఎంపిక కాలేదు. ఎంపిక కాని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన రూ.10 వేల మొత్తాన్ని తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.
రిఫండ్ ప్రక్రియలో బ్యాంకు ఖాతా వివరాలు సక్రమంగా ఉండేలా లబ్ధిదారులు నిర్ధారించుకోవాలని అధికారులు సూచించారు.