www.ntodaynews.com
చెత్త వేసి ధర్నాకు దిగిన ప్రజలు
తెలంగాణ
మున్సిపల్ కార్యాలయం ముందు చెత్త వేసి ధర్నాకు దిగిన ప్రజలు
శివనేనిగూడెం డంపింగ్ యార్డ్ వెంటనే తొలగించాలంటూ తీవ్ర ఆందోళన NTODAY NEWS : చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు శివనేనిగూడెం సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్‌ను వెంటనే తొలగించాలంటూ గ్రామ ప్రజలు అఖిలపక్ష నాయకులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముందు చెత్తను వేసి ధర్నాకు దిగారు. డంపింగ్ యార్డ్ కారణంగా గ్రామంలో శ్వాసకోశ వ్యాధులు పెరిగాయని, ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులు గాలి పీల్చడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో ఎలాంటి సమస్యలు లేవని, మున్సిపాలిటీలో విలీనం చేసిన తర్వాత చిట్యాలలో సేకరించిన చెత్త మొత్తాన్ని శివనేనిగూడెం గ్రామ శివారులోనే వేస్తున్నారని ఆరోపించారు. ప్రతిరోజూ చెత్తను తగలబెట్టడం వల్ల పొగ, కలుషిత వాయువులు వెలువడుతున్నాయని, దీనితో గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ నిబంధనల ప్రకారం చెత్తను తగలబెట్టకూడదని చెప్పినా, చిట్యాల మున్సిపాలిటీ అధికారులు మాత్రం నిత్యం చెత్తను దహనం చేయడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతోందని విమర్శించారు. అలాగే, చుట్టుపక్కల ప్రైవేట్ కంపెనీల చెత్త, హోటళ్లలో మిగిలిన ఆహారం, చనిపోయిన జంతువుల కళేబరాలను ఇక్కడే డంపింగ్ చేయడం వల్ల దుర్వాసనతో జీవించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ డంపింగ్ యార్డ్ రైతులు పండించే పంటలకు కూడా తీవ్ర నష్టం కలిగిస్తోందని, ముఖ్యంగా పత్తి పంటపై దుమ్ము, ధూళి పడటంతో రంగు మారిపోయి కొనుగోలుదారులు రావడం మానేశారని వాపోయారు.
ఈ సమస్యపై పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు, ఆర్డీవోకు, మున్సిపల్ కమిషనర్‌కు, గత పాలకవర్గం సమయంలో మున్సిపల్ చైర్మన్‌కు వినతులు ఇచ్చినా ఎలాంటి స్పందన లేదన్నారు. ప్రస్తుత కమిషనర్‌కు కూడా పలు మార్లు వినతి పత్రాలు అందజేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తాత్కాలికంగా డంపింగ్ చేస్తున్నామని చెబుతూ ప్రతిరోజూ వ్యర్థాలను గ్రామ శివారులో వదిలేసి వెళ్తున్నారని తెలిపారు.
డంపింగ్ యార్డ్‌ను గ్రామ పరిసరాల నుంచి పూర్తిగా తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ప్రకటించారు. అనంతరం రెండు మూడు రోజుల్లో ఆర్డీవో వచ్చి సర్వే నిర్వహించి డంపింగ్ యార్డ్‌ను వేరే ప్రాంతానికి తరలిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు.
చిట్యాల మున్సిపల్ కమిషనర్ వివరణ
శివనేనిగూడెం ప్రాంతంలోని డంపింగ్ యార్డ్‌లో ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా చెత్త వేస్తున్నారని, అలాంటి వారిపై మున్సిపల్ సిబ్బంది పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. గతంలో చిట్యాలలోని సర్వే నంబర్ 55 (పోతరాజు కుంట) వద్ద చెత్త వేయడం వల్ల కుంట నిండిపోవడంతో జాతీయ రహదారికి ఇబ్బందులు ఏర్పడ్డాయని, అందుకే ప్రస్తుతం సర్వే నంబర్ 59లో చెత్తను డంపింగ్ చేస్తున్నట్లు చెప్పారు. శివనేనిగూడెం ప్రజలు అభ్యంతరం తెలపడంతో ఈ సమస్యను జిల్లా కలెక్టర్‌కు, ఆర్డీవోకు, స్థానిక తాసిల్దార్‌కు తెలియజేశామని, త్వరలోనే డంపింగ్ యార్డ్‌ను వేరే ప్రాంతానికి మార్చే చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు
Follow us on
Website
Facebook
Instagram
YouTube