మంత్రి పదవి హామీతో మోసం చేశారు.. నిధుల కోసం ప్రభుత్వంతో కొట్లాడాల్సి వస్తోంది
నిధులు విడుదల చేయకపోతే ఎమ్మెల్యేగా కొనసాగడం దండగ: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
మనసు చంపుకుని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్దకు వెళ్తున్నా ఫలితం లేదని వ్యాఖ్య
మునుగోడు ఎన్ టుడే న్యూస్: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి రాజకీయ చర్చకు దారితీసేలా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన సొంత ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల చేయకపోతే ఎమ్మెల్యేగా కొనసాగడం దండగ అని వ్యాఖ్యానించారు.
ఆదివారం నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రంలో బీరప్ప గొర్రెల పెంపకందారుల సహకార సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యే మాదిరిగా ప్రభుత్వంతో పోరాడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తనను మోసం చేశారని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. నిధుల కోసం వారి వద్దకు మనసు చంపుకుని వెళ్లాల్సి వస్తోందని, అయినప్పటికీ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో నిధులు విడుదల కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం సహా అభివృద్ధి పనులకు నిధులు అందడం లేదని, ఇప్పటికే చేపట్టిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత పనులకే నిధులు విడుదల కాకపోతే కొత్త పనులు ఎలా చేపట్టాలని ప్రశ్నించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంటుందని, అందుకు ప్రభుత్వం నుంచి తగిన నిధులు అందాల్సిన అవసరం ఉందని అన్నారు. అభివృద్ధి చేయలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా కొనసాగడం వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
సొంత ప్రభుత్వంపై అధికార పార్టీ ఎమ్మెల్యే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం మరోసారి తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చకు దారితీసింది.