కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఆగిన పనులతో ట్రాఫిక్ ఇబ్బందులు
ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల పనుల పేరిట ప్రజాధనం వృథా చేశారంటూ విమర్శలు
హైదరాబాద్: కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం కోసం గతంలో ప్రారంభించిన పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణ పనుల కోసం రోడ్ల మధ్య గుంతలు తవ్వడం, చెట్లను తొలగించడం వంటి చర్యలు చేపట్టినప్పటికీ ప్రతిపాదిత ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల ప్రాజెక్టులు చివరకు రద్దు కావడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని పేర్కొంటున్నారు.
తాజాగా పంజాగుట్ట ఎన్ఎఫ్‌సీ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్ మీదుగా ముఫకంజా విద్యా సంస్థల వరకు సుమారు 4 కిలోమీటర్ల పొడవున ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
అయితే గతంలో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం పేరుతో చెట్లను తొలగించి, రోడ్లను తవ్వడంతో పాటు కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేశారని పలువురు విమర్శిస్తున్నారు. ఆ పనులు పూర్తికాకపోవడంతో ప్రస్తుతం నిర్మాణ ప్రదేశాల్లో ఏర్పడిన పరిస్థితులు ప్రజలకు ఇబ్బందిగా మారాయని పేర్కొంటున్నారు.
కేబీఆర్ పార్క్ పరిసరాల్లో రహదారులు తవ్వి ఉండటంతో ట్రాఫిక్ రద్దీ పెరిగి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. గతంలో చేపట్టిన పనులపై స్పష్టత ఇవ్వడంతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న రహదారి సమస్యలను త్వరగా పరిష్కరించాలని వారు కోరుతున్నారు.