ముత్తనపల్లిలో కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ
పల్నాడు జిల్లా, రొంపిచర్ల:
రొంపిచర్ల మండలం ముత్తనపల్లి గ్రామంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి, మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం గ్రామంలో పండుగ వాతావరణంలో జరిగింది.
ఈ సందర్భంగా అరవింద్ బాబు మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు, కోడెల శివప్రసాదరావు పేర్లు పల్నాడు ప్రాంతంతో పాటు తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. టీడీపీ ఆవిర్భావ సమయంలో కోడెల శివప్రసాదరావు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవకు అంకితమయ్యారని పేర్కొన్నారు.
వైద్య వృత్తిలో కొనసాగుతూనే రాజకీయాల్లోనూ కోడెల శివప్రసాదరావు తనదైన ముద్ర వేశారని అరవింద్ బాబు తెలిపారు. పల్నాడు ప్రాంతానికి ఆయన వంటి నాయకుడు సేవలందించడం ప్రజలకు గుర్తుండిపోయే విషయమన్నారు. టీడీపీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో కోడెలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా నిలిచారని గుర్తుచేశారు.
టీడీపీ కుల, మత భేదాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ముందుకు సాగుతుందని అరవింద్ బాబు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పార్టీ నాయకత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రస్తుత తరంలోనూ కోడెల శివప్రసాదరావు సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు.
కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిన ముత్తనపల్లి గ్రామ టీడీపీ నాయకులను అరవింద్ బాబు అభినందించారు.
కార్యక్రమంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం, గాడిపర్తి సురేష్, నాగిరెడ్డి, మొండితోక రామారావు తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ, ముస్లిం, ఓబీసీ, వ్యాపార వర్గాల ప్రతినిధులతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.