చింతలపూడి విద్యుత్ సబ్‌డివిజన్‌లో అక్రమాల కలకలం
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
భారీగా బయటపడుతున్న అవినీతి.. తవ్వేకొద్దీ అక్రమాలు చింతలపూడి విద్యుత్ సబ్‌డివిజన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ల వ్యవహారంపై విచారణ ఏలూరు జిల్లా చింతలపూడి విద్యుత్ సబ్‌డివిజన్ పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు, మార్పిడి వ్యవహారంపై జరుగుతున్న విచారణలో పలు ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. చింతలపూడి మండలం ఎండపల్లిలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న ట్రాన్స్‌ఫార్మర్ల అక్రమాలపై విశాఖపట్నం సీఎండీ కార్యాలయం నుంచి వచ్చిన ఉన్నతాధికారుల బృందం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఎండపల్లి ప్రాంతానికి వెళ్లిన అధికారులకు పెద్ద సంఖ్యలో రైతులు హాజరై తమ సమస్యలను వివరించినట్లు సమాచారం. తమకు సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్లను విద్యుత్ శాఖ అధికారులు తమ అనుమతి లేకుండా, ఇష్టానుసారంగా మార్చివేశారని పలువురు రైతులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు, కేటాయింపు, మార్పిడి ప్రక్రియలో అవకతవకలు జరిగాయని రైతులు విచారణ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. తమకు జరిగిన అన్యాయంపై గతంలో స్థానిక విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించినప్పటికీ తగిన స్పందన లభించలేదని కొందరు రైతులు ఆరోపించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల స్థాయిలో విచారణ జరగడంతో మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా, ట్రాన్స్‌ఫార్మర్ల వ్యవహారంలో జరుగుతున్న అక్రమాలకు చింతలపూడి విద్యుత్ శాఖలోని కొందరు అధికారులు అండగా నిలుస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా పూర్తి స్థాయి విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది. విచారణలో బయటపడే అంశాలు, బాధ్యులపై తీసుకునే చర్యలపై రైతులు, స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.