ఆంధ్ర ప్రదేశ్ లో పాఠశాల యాజమాన్య కమిటీ పునర్నిర్మాణానికి షెడ్యూల్ విడుదల
15న నోటిఫికేషన్.. 29న ఎన్నికలు.. అదే రోజు ప్రమాణ స్వీకారం, తొలి సమావేశం
పాఠశాల యాజమాన్య కమిటీ పునర్నిర్మాణానికి సంబంధించి కీలక తేదీలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 15న ఉదయం 10 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. సెప్టెంబర్ 18న మధ్యాహ్నం 2 గంటలకు ఓటర్ల జాబితాను పాఠశాల నోటీసు బోర్డుపై ప్రదర్శిస్తారు. సెప్టెంబర్ 25న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య తుది ఓటర్ల జాబితాను ఖరారు చేసి ప్రదర్శిస్తారు.
సెప్టెంబర్ 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు సభ్యులు, చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల మధ్య తొలి పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.
తల్లిదండ్రులకు 75 శాతం ప్రాతినిధ్యం
పాఠశాల యాజమాన్య కమిటీలో 75 శాతం మంది తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుంచి ఉండాలి. మిగిలిన 25 శాతం ప్రాతినిధ్యంలో మూడో వంతు స్థానిక సంస్థల ఎన్నికైన ప్రతినిధులు, మూడో వంతు పాఠశాల ఉపాధ్యాయులు, మరో మూడో వంతు స్థానిక విద్యావేత్తలు, విషయ నిపుణులు, విద్యావేత్తలు, పూర్వ విద్యార్థులు, అంగన్‌వాడీ, ఆశా, ఏఎన్‌ఎం తదితర వర్గాల నుంచి ఎంపిక చేస్తారు.
మొత్తం కమిటీలో 50 శాతం మహిళలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలతో పాటు ప్రత్యేక అవసరాలున్న పిల్లల తల్లిదండ్రులకు కూడా తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.
ఒక్క విద్యార్థికి ఒక్క తల్లిదండ్రి లేదా సంరక్షకుడికే అవకాశం
ఎన్నికల్లో ప్రతి విద్యార్థికి ఒక తల్లిదండ్రి లేదా సంరక్షకుడు మాత్రమే పాల్గొనేందుకు అర్హత ఉంటుంది. అర్హత ఉన్న తల్లిదండ్రులు తమను తాము లేదా మరో అర్హుడైన తల్లిదండ్రిని అభ్యర్థిగా ప్రతిపాదించవచ్చు. పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య సీట్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు చేతులు ఎత్తడం లేదా వాయిస్ ఓటింగ్ ద్వారా ఎన్నిక నిర్వహించవచ్చు. ఎన్నికల సమయంలో వివాదం తలెత్తితే రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంటుంది.
ఓటింగ్ నిర్వహించేందుకు కనీసం 50 శాతం మంది తల్లిదండ్రులు లేదా సంరక్షకులు హాజరు కావాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియను విద్యాశాఖ అధికారి లేదా అధీకృత ప్రతినిధి పర్యవేక్షించవచ్చు.
రెండేళ్ల పదవీకాలం
పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల పదవీకాలం రెండేళ్లుగా ఉంటుంది. ఒక సభ్యుడు వరుసగా రెండు పదవీకాలాలకు మించి కొనసాగేందుకు అవకాశం ఉండదు. అయితే సభ్య కార్యదర్శికి ఈ పరిమితి వర్తించదు.
కీలక తేదీలు ఇలా..
15 సెప్టెంబర్ – ఎన్నికల నోటిఫికేషన్
18 సెప్టెంబర్ – ఓటర్ల జాబితా ప్రదర్శన
25 సెప్టెంబర్ – అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం
25 సెప్టెంబర్ – తుది ఓటర్ల జాబితా ప్రదర్శన
29 సెప్టెంబర్ – పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యుల ఎన్నికలు
29 సెప్టెంబర్ – చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక
29 సెప్టెంబర్ – ప్రమాణ స్వీకారం
29 సెప్టెంబర్ – తొలి పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం