సెప్టెంబర్ 20లోపు పంట నమోదు పూర్తి చేయాలి
సెప్టెంబర్ 20లోపు పంట నమోదు పూర్తి చేయాలి ఏలూరు జిల్లా చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్
పంట నమోదు మిస్ అయితే రైతులకు నష్టం సెప్టెంబర్ 20లోపు నమోదు తప్పనిసరి.. ఎల్‌నినో ప్రభావంపై రైతులకు వ్యవసాయ శాఖ హెచ్చరిక ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని రైతులందరూ పంట నమోదును తప్పనిసరిగా చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ సూచించారు. పంట నమోదు విషయంలో రైతులు నిర్లక్ష్యం చేయకుండా గడువులోగా ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ రైతులు తమ గ్రామంలోని రైతు సేవా కేంద్రం ఇన్‌చార్జిని సంప్రదించి, పంటల వారీగా ఆధార్ నంబర్‌తో ఈ నెల 20వ తేదీలోపు పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు. పంట నమోదు ద్వారా రైతులకు అందే ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ శాఖ సేవలు, పంటలకు సంబంధించిన ప్రయోజనాలు సులభంగా అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావం.. నీటి పొదుపే కీలకం ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని శివశంకర్ సూచించారు. ప్రతి నీటి బొట్టును పొదుపు చేసుకునేలా నీటి యాజమాన్య పద్ధతులను పాటించాలని తెలిపారు. నీటి కుంటలు, ఇంకుడు గుంతలు, పొలాల్లో నీటి కుంటలు, ఫామ్ పాండ్ల ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేసుకుంటే భూగర్భ జలాలను పెంచుకోవడంతో పాటు భవిష్యత్‌లో బోర్లకు నీటి లభ్యత మెరుగుపడే అవకాశం ఉంటుందని వివరించారు. నేలలో తేమ ఉంటేనే పంటకు ఊపిరి భూమిలో సేంద్రీయ కర్బన పదార్థం అధికంగా ఉండేలా చూసుకోవాలని వ్యవసాయ అధికారి సూచించారు. నేలలో సేంద్రీయ పదార్థం పెరిగితే తేమను ఎక్కువ కాలం నిలుపుకునే సామర్థ్యం పెరుగుతుందని, ఎండ తీవ్రతలో నీరు త్వరగా ఆవిరి కాకుండా పంటకు ఉపయోగపడుతుందని తెలిపారు. దీంతో నీటి ఎద్దడి సమయంలో కూడా మొక్కలను కొంతవరకు రక్షించుకోవచ్చని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంతో నీటి ఎద్దడికి చెక్ రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను కూడా విస్తృతంగా అవలంబించాలని సూచించారు. జీవామృతం, కోడిగుడ్డు–నిమ్మ ద్రావణం, చేప–బెల్లం ద్రావణం, పంచకావ్య వంటి ప్రకృతి వ్యవసాయ కషాయాలను పంటల అవసరాలకు అనుగుణంగా వినియోగించడం ద్వారా మొక్కల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. చిత్తపూరులో ‘పొలం పిలుస్తుంది’ చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో మంగళవారం ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పంట నమోదు, నీటి పొదుపు, నేలలో తేమ సంరక్షణ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విహెచ్ఎ సుబ్బారావు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.