ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం కొనసాగిస్తాం
పీఆర్సీ విడుదల, సీపీఎస్ రద్దుపై హామీ నిలబెట్టుకోవాలి
హెల్త్ కార్డుల లోపాలు సరిచేయాలి.. వేసవి సెలవుల్లో పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి
పీఆర్టీయూ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
ఖమ్మం: ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఖమ్మం–నల్గొండ–వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి స్పష్టం చేశారు. పీఆర్సీ విడుదల, కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దుపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం జిల్లా సంఘ కార్యాలయంలో జిల్లా కౌన్సిల్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రంగారావు గత రెండేళ్లలో సంఘం చేపట్టిన కార్యక్రమాల నివేదికను ప్రవేశపెట్టగా, చర్చ అనంతరం సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేయడాన్ని ఖండించారు. పీఆర్సీ విడుదల, సీపీఎస్ రద్దు అంశాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాల నుంచి గత నాలుగు నెలలుగా హెల్త్ కార్డుల కోసం ప్రీమియం కట్ చేస్తున్నప్పటికీ, వాటి అమలులో సమస్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే లోపాలను సరిచేసి హెల్త్ కార్డుల సేవలను సమర్థంగా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టేలా కృషి చేస్తానని తెలిపారు. ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు తీరులో సమస్యలు, హేతుబద్ధీకరణ జీవోలో సవరణలు, ఎంఈఓ పోస్టుల భర్తీ వంటి అంశాలపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఉపాధ్యాయులు బోధనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించేలా ఆన్‌లైన్ పనిభారాన్ని తగ్గించాలని అధికారులకు సూచిస్తానని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు టీ. జితేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి టీ. నరేష్, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రంగారావు, జిల్లా మాజీ అధ్యక్షులు మోత్కూరి మధు, యలమద్ది వెంకటేశ్వర్లు, కార్యాలయ ఇన్‌చార్జి కె. వెంకట నరసయ్య, ఏఐఎఫ్‌టీఓ ఉపాధ్యక్షుడు చిత్తలూరి ప్రసాద్, పత్రిక ఉపసంపాదకుడు కేవీ రమణ, పత్రిక సంపాదక మండలి సభ్యుడు జీవీ రమణ, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు జి. విజయ, అమృత్ కుమార్, ఆర్. బ్రహ్మారెడ్డి, టీ. రత్నకుమార్, జి. సుజాత, కేజీబీవీ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ సౌజన్యతో పాటు వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా, మండల కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు, సంఘ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.