వారెంట్లు ఉన్నా విదేశాలకు వెళ్తారా?
• ఐఏఎస్ తీరుపై హైకోర్టు ఆగ్రహం
తెలంగాణ / Ntoday News:
కోర్టు ధిక్కరణ కేసులో బెయిలబుల్ వారెంట్లు అమల్లో ఉండగా కీలక హోదాల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులు విదేశీ పర్యటనలకు ఎలా వెళ్తారని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు వారిని అడ్డుకుని అరెస్టు చేసి ఉంటే పరిస్థితి ఏమయ్యేదని ప్రశ్నించింది. భూసేకరణ పరిహారం చెల్లింపు వ్యవహారంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినం దుకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఆర్అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్లకు వ్యతిరేకంగా దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. భూసేక రణ ప్రక్రియలో తమకు 50 శాతం కూడా పరిహారం ఇవ్వ లేదని గతంలో బాధితులు హైకోర్టును ఆశ్రయించగా.. పూర్తి పరిహారాన్ని వెంటనే చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. అయినా పరిహారం ఇవ్వకపోవడంతో బాధితులు మళ్లీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా.. సదరు ఐఏఎస్ అధికారులకు గతంలో బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఈ పిటిషన్ మళ్లీ విచారణకు రాగా.. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా అధికారులు కోర్టుకు వ్యక్తిగతంగా రాలేకపోయారని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి విన్నవించారు. దీనిపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ అధికారుల వ్యవహారశైలిని తప్పు పట్టారు. అయితే పరిహారాన్ని ఇటీవలే ఖాతాల్లో జమ చేశామని న్యాయవాదులు వివరించగా.. కోర్టు ధిక్కరణ పిటిషన్ ను క్లోజ్ చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.