కుల్కచర్లలో మహిళ హత్య కేసు
అదృశ్యమైన మహిళ మృతదేహం తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో లభ్యం
కుల్కచర్ల: కుల్కచర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చెల్లాపూర్‌కు చెందిన గంధం అమృతమ్మ (34) హత్యకు గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 18న తల్లి ఇంటికి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన అమృతమ్మ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో మంగలి ఆనంద్ (28)పై పోలీసులకు అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. పోలీసుల విచారణలో వెన్నచెడ్ శివారులోని చెరువు వద్ద అమృతమ్మను హత్య చేసినట్లు ఆనంద్ వెల్లడించినట్లు తెలుస్తోంది.
అనంతరం మృతదేహంపై డీజిల్ పోసి నిప్పంటించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో దానిని సంచిలో వేసి బైక్‌పై తరలించి తెలంగాణ–కర్ణాటక సరిహద్దులోని రాయచూర్ మార్గంలో చెట్ల పొదల్లో పడేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
సరిహద్దు ప్రాంతంలో అమృతమ్మ మృతదేహం లభ్యమైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు దర్యాప్తు ద్వారా సేకరిస్తున్నారు. మంగలి ఆనంద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.