ప్రేమ వ్యవహారం యువతి మృతి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని తండ్రి ఫిర్యాదు
జనగామ జిల్లా: ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వివాదం నేపథ్యంలో గడ్డి మందు తాగిన యువతి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన వాడపల్లి మానస (18) శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవంబర్ 1వ తేదీ తెల్లవారుజామున 3.30 గంటలకు మానస మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెళ్లికి నిరాకరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపణ తన కుమార్తె మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని మానస తండ్రి వాడపల్లి సోమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడకండ్లకు చెందిన చెన్న సాయి గణేష్ (23) గత కొంతకాలంగా తన కుమార్తెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా, మానసికంగా మోసం చేశాడని ఆయన ఆరోపించారు. పెళ్లి చేసుకోవాలని మానస కోరగా, సదరు యువకుడితో పాటు అతని తల్లిదండ్రులు సత్యం, కవిత కూడా వివాహానికి నిరాకరించి ఆమెను ఇబ్బందులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిణామాలతో మనస్తాపానికి గురైన తన కుమార్తె గడ్డి మందు తాగినట్లు తనకు తెలిపిందని సోమయ్య వెల్లడించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆరోపణలపై పోలీసుల విచారణలో వాస్తవాలు వెల్లడికావాల్సి ఉంది.