22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట!
22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట!
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం – పత్రాల పంపిణీ
రైతులకు, ప్రజలకు పారదర్శక సేవలే లక్ష్యం
జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
అన్నమయ్య జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 22-A భూ సమస్యలకు జిల్లా యంత్రాంగం వేగంగా పరిష్కారం చూపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చేపట్టిన ప్రత్యేక చర్యల ఫలితంగా జిల్లాలో భూ సమస్యలను వేగంగా పరిష్కరించడం జరుగుతుంది. ఈ మేరకు ఏళ్లుగా పరిష్కారం కాని మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో -3, పీలేరు సబ్ డివిజన్ పరిధిలో - 01 సమస్యలను పరిష్కరించి, సంబంధిత రైతులకు, ప్రజలకు 22-A భూ సమస్య పరిష్కరించిన ప్రొసీడింగ్లను మంజూరు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తెలిపారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో 22-A భూ సమస్యలు పరిష్కరించి నలుగురు లబ్దిదారులకు మంజూరు పత్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ స్వయంగా అందజేశారు. గత అనేక సంవత్సరాలుగా 22- A, సర్వే నంబర్ సవరణలు, కొత్త సర్వే నంబర్ల చేర్పులు, అడంగల్ వివరాల సరిదిద్దడం వంటి సమస్యలతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులకు ఈ చర్యల ద్వారా ఊరట లభించింది.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ... మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత పాత రికార్డులు, దస్త్రాలను సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించామని తెలిపారు. ముఖ్యంగా మూడు నుంచి ఐదు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కారం కల్పించేందుకు రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.
భూమి రికార్డులు సరిగ్గా ఉండటం రైతులకు అత్యంత కీలకమని, పంట రుణాలు, భూమి లావాదేవీలు మరియు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడంలో వెబ్‌ల్యాండ్ రికార్డులు ముఖ్య పాత్ర పోషిస్తాయని జాయింట్ కలెక్టర్ వివరించారు. రికార్డుల్లో ఉన్న లోపాలను సరిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే జిల్లా పరిపాలన ప్రధాన లక్ష్యమని తెలిపారు.
మిగిలిన దరఖాస్తులను కూడా వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని, రెవెన్యూ శాఖ అధికారులు బాధ్యతతో పనిచేసి ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.
డి ఐ పి ఆర్ ఓ,అన్నమయ్య జిల్లా.