ఆపదలో ప్రాణ దాతగా 108 సేవలు
అపదలో ప్రాణదాతగా 108 సేవలు: మూడు నెలల్లో 9,183 గుండెపోటు బాధితులకు పునర్జన్మ
అమరావతి, ఏప్రిల్ 03: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతున్న 108 అత్యవసర అంబులెన్స్ సేవలు ప్రజల ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తూ నిజమైన ప్రాణదాతగా నిలుస్తున్నాయి. భవ్య హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సేవలు అత్యంత వేగంగా స్పందిస్తూ, ముఖ్యంగా గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో సమయానుకూల వైద్య సహాయం అందిస్తూ విశేష ఫలితాలను సాధిస్తున్నాయి. గత మూడు నెలల కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా 9,183 మంది గుండెపోటు బాధితులను మృత్యువు అంచునుంచి కాపాడటం 108 సేవల సమర్థతకు నిదర్శనంగా నిలిచింది.
108 అంబులెన్స్ సేవలు కేవలం రోగులను ఒక చోటు నుంచి మరొకచోటుకు తరలించే రవాణా వ్యవస్థగా కాకుండా, పూర్తిస్థాయి మొబైల్ అత్యవసర వైద్య యూనిట్‌గా పనిచేస్తున్నాయి. సమగ్ర ప్రీ-హాస్పిటల్ కేర్, శిక్షణ పొందిన సిబ్బంది, ఆధునిక వైద్య పరికరాలు, 24 గంటల వైద్య పర్యవేక్షణ వంటి అంశాలతో ఈ సేవలు ప్రజలకు భరోసానిచ్చే వ్యవస్థగా మారాయి. గుండెపోటు వచ్చిన తర్వాత తొలి గంటను ‘గోల్డెన్ అవర్’గా పరిగణిస్తారు. ఈ సమయంలో సరైన చికిత్స అందితే ప్రాణాలను రక్షించే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ కీలక సమయంలో 108 సిబ్బంది వేగంగా స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని అంబులెన్స్‌లోనే ప్రాథమిక చికిత్స అందించడం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడుతున్నారు.
అంబులెన్స్‌లో పనిచేసే శిక్షణ పొందిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు రోగి పరిస్థితిని అంచనా వేసి తక్షణమే అవసరమైన చర్యలు ప్రారంభిస్తారు. ఆక్సిజన్ అందించడం, సీపీఆర్ నిర్వహించడం, రక్తపోటు నియంత్రణ, బేసిక్ లైఫ్ సపోర్ట్ వంటి కీలక వైద్య సేవలను ఆసుపత్రికి చేరుకునేలోపే అందించడం వల్ల రోగుల ప్రాణాలకు రక్షణ కలుగుతోంది. ఇదే సమయంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్‌లో ఉన్న వైద్యులతో నిరంతరం సంప్రదిస్తూ రోగి పరిస్థితికి అనుగుణంగా చికిత్స కొనసాగించడం మరింత ఫలితాలను ఇస్తోంది.
ప్రైవేట్ అంబులెన్స్ సేవలతో పోలిస్తే 108 సేవలు వైద్యపరంగా మరింత సమగ్రంగా పనిచేస్తున్నాయి. ప్రైవేట్ అంబులెన్స్‌లు ఎక్కువగా రవాణాపైనే దృష్టి పెట్టగా, 108 అంబులెన్స్‌లు పూర్తిస్థాయి వైద్య సేవలను అందించే మొబైల్ యూనిట్‌గా రూపుదిద్దుకున్నాయి. రియల్ టైమ్ వైద్య మార్గదర్శకంతో పాటు ఆధునిక పరికరాలు, శిక్షణ పొందిన సిబ్బంది ఉండటం వల్ల ప్రజలకు మరింత భరోసా కలుగుతోంది.
అత్యవసర ప్రసూతి సేవల విషయంలో కూడా 108 అంబులెన్స్‌లు కీలకంగా నిలుస్తున్నాయి. తీవ్ర గర్భధారణ పరిస్థితుల్లో ఆసుపత్రికి చేరుకునేలోపే ప్రసవం అవసరమైన సందర్భాల్లో, ఎమ్టీలు అంబులెన్స్‌లోనే సురక్షితంగా డెలివరీ నిర్వహించగల నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సేవలు ఎంతోమందికి ప్రాణరక్షకంగా మారాయి.
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ 108 సేవలు ఆధునిక వైద్య వ్యవస్థగా అభివృద్ధి చెందాయి. అంబులెన్స్‌లలో అమర్చిన డోమ్ కెమెరాల ద్వారా రోగి పరిస్థితిని వైద్యులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు ఇవ్వడం ద్వారా సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతోంది. కాల్ సెంటర్ వ్యవస్థ, వైద్య బృందం, అంబులెన్స్ సిబ్బంది మధ్య సమన్వయం వల్ల అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన సేవలు అందుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా గత మూడు నెలల్లో అందిన వేలాది కాల్స్‌కు స్పందిస్తూ గుండెపోటు కేసుల్లోనే 9,183 మంది ప్రాణాలను కాపాడటం ఈ సేవల సామర్థ్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు సమానంగా సేవలు అందించడం మరో విశేషంగా నిలిచింది.
ప్రజలు గుండెపోటు లక్షణాలను ఎప్పటికప్పుడు గుర్తించడం చాలా ముఖ్యం. ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధికంగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా 108 నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సమయానికి తీసుకునే నిర్ణయం ప్రాణాలను కాపాడగలదని వారు పేర్కొంటున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవలు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాయని, ఈ ఉచిత సేవలను ప్రజలు నిరభ్యంతరంగా వినియోగించుకోవాలని 108 అత్యవసర సేవల మీడియా సమన్వయకర్త విజ్ఞప్తి చేశారు.