స్వయం ఉపాధితో ఆర్థిక స్వావలంబన సాధించాలి
స్వయం ఉపాధితో ఆర్థిక స్వావలంబన సాధించాలి: సీనియర్ సివిల్ జడ్జి పూజ
వరంగల్: వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కందుకూరి పూజ కాశీబుగ్గలోని స్వశక్తి సధన్, ఆనంద ఆశ్రమం వృద్ధాశ్రమాలను సందర్శించారు.
ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసిన వారికి టైలరింగ్ ధ్రువపత్రాలను అందజేశారు. శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలను ఉపయోగించుకుని స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు.
అనంతరం వృద్ధాశ్రమాలను సందర్శించిన జడ్జి పూజ.. అక్కడి వృద్ధుల యోగక్షేమాలు, వారికి అందుతున్న వసతులు, ఆరోగ్య సంరక్షణ తదితర అంశాలను పరిశీలించారు. వృద్ధులకు అవసరమైన సహకారం అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వృద్ధుల సంక్షేమం, శిక్షణ పొందిన వారికి స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు అవసరమైన సహకారం అందించడంలో న్యాయ సేవాధికార సంస్థ ముందుంటుందని ఆమె పేర్కొన్నారు.